Home / Telugu / Telugu Bible / Web / Isaiah

 

Isaiah, Chapter 35

  
1. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును
  
2. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
  
3. సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.
  
4. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.
  
5. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును
  
6. కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును
  
7. ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.
  
8. అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు
  
9. అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు
  
10. వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.