Home / Telugu / Telugu Bible / Web / Proverbs

 

Proverbs, Chapter 4

  
1. కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
  
2. నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.
  
3. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమా రుడనైయుంటిని.
  
4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
  
5. జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించు కొనుము నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము.
  
6. జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
  
7. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము.
  
8. దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
  
9. అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
  
10. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీక రించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
  
11. జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
  
12. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
  
13. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టు కొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
  
14. భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
  
15. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
  
16. అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
  
17. కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
  
18. పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
  
19. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
  
20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
  
21. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
  
22. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
  
23. నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
  
24. మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.
  
25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
  
26. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
  
27. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.