Home / Telugu / Telugu Bible / Web / Psalms

 

Psalms, Chapter 69

  
1. దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.
  
2. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.
  
3. నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను.
  
4. నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.
  
5. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
  
6. ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము.
  
7. నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.
  
8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.
  
9. నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.
  
10. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.
  
11. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని.
  
12. గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.
  
13. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.
  
14. నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము.
  
15. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము.
  
16. యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.
  
17. నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.
  
18. నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.
  
19. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెననినీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.
  
20. నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవ రును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.
  
21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
  
22. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.
  
23. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.
  
24. వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
  
25. వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
  
26. నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
  
27. దోషముమీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము.
  
28. జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
  
29. నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక.
  
30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను
  
31. ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము
  
32. బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక.
  
33. యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు.
  
34. భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.
  
35. దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
  
36. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివ సించెదరు.